*కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు*టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
*వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది*
*10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది*
*వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేయాలి*
*కేంద్రం తక్షణమే వెయ్యి కోట్లు విడుదల చేయాలి*
*టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి*
వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, కేసీఆర్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు అని టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందస్తుగా వరదలపై సీఎం కేసీఆర్ సమీక్షలు చేయకుండా ప్రగతి భవన్ ను చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఓ వైపు భారీ వర్షాలతో జనం అతలాకుతలం అవుతుంటే ఒకరు ఫామ్ హౌస్ లో, మరొకరు విందులు వినోదాలలో మునిగి తేలుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
“రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది... సీఎం, మునిసిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం అన్నది ఉందా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ భూమి మీద ఉన్నా లేనట్టేన. అందుకే వారు లేరని ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయ్యారని సోమవారం ఆ ఇద్దరు తండ్రీ కొడుకులకు తద్దినం పెట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులకు పిలుపునిస్తున్నా” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తొమ్మిదేళ్లుగా ప్రతీ ఏటా వరదలు రావడం, ప్రభుత్వం మరిచిపోవడం పరిపాటిగా మారిందని ప్రభుత్వ తీరును రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 వేల కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోందన్నారు. 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందనే అంచనాలు ఉన్నాయన్నారు. ఇసుక మేటలతో నిండిన వ్యవసాయ భూములకు రూ.20 వేలు అందించాలి అని డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. వరదల్లో నష్టపోయిన వారికి తాత్కాలిక నష్ట పరిహారంగా రూ.15 వేలు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
శనివారం నాడు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉప్పల్, ఎల్బీ నగర్నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించారు. వరద ముప్పు పై సమీక్షలు చేయకుండా కేసీఆర్ రాజకీయాలపై దృష్టి పెట్టారని విమర్శించారు. రాష్ట్రం వరదలతో అతలాకుతలమైతే పట్టించుకోకుండా తండ్రీ కొడుకులు ప్రజల ప్రాణాలు పూచీక పుల్లతో సమానం అన్నట్లు వ్యవహరిస్తున్నారు అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు.
వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ కు బాత్రూంలు కడగడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేటీఆర్ బర్త్ డే పార్టీల్లో మునిగిపోయారు మున్సిపల్ శాఖ మంత్రిని ఉరేసినా తప్పు లేదు అని విమర్శించారు. హైదరాబాద్ నగరంపై కేటీఆర్ వి ఆర్భాటపు ప్రకటనలే తప్ప మరొకటి కాదని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ నగరం పరిస్థితి మేడిపండు చందంగా మారిందన్నారు. పాలకుల కక్కుర్తి వల్లే కాలనీలు వరదల్లో మునిగిపోయాయని ఆరోపించారు. నిజాం కాలం నాటి చెరువులను 90 శాతం మంది బీఆరెస్ నేతలు ఆక్రమించుకున్నారు. చెరువుల ఆక్రమనలతో కాలనీలు వరదల్లో మునిగిపోయాయి అని ఆరోపించారు. కేటీఆర్ కు విలాసాలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. రియల్ ఎస్టేట్ కోసమే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆరెస్ లో చేరారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. సుధీర్ రెడ్డి మూసి రివర్ ఫ్రంట్ ఆథారిటికి చైర్మన్ అయ్యి.. నియోజకవర్గ ప్రజలను మూసీలో ముంచారు అని ఆయన ఎద్దేవా చేశారు.
వరదలు, వర్షాలతో 30 మంది చనిపోయినా ఎందుకు పరామర్శించేందుకు లేదని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రగతి భవన్ లో కుక్కకు ఉన్న విలువ ప్రజల ప్రాణాలకు లేదా? అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయింది. అందుకే ఈ ప్రభుత్వానికి వరద నీటిలో తద్దినం పెట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నా అన్నారు. హైకోర్టు అక్షింతలు వేసినా కేసీఆర్ కు బుద్ది రాలేదు అని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు.
కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక వరద సాయం కింద తెలంగాణకు వెయ్యి కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వరద సాయం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిగారిపై ఉందన్నారు. ఇంత జరుగుతున్నా కిషన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక్కడి పరిస్థితిని కిషన్ రెడ్డి ప్రధానికి వివరించి వెంటనే నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంతో ఆయనకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎంపీలంతా కలిసి పార్లమెంటులో అమిత్ షా ను కలిసి వరద నష్టంపై నివేదిక ఇస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
*ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలి*
ఉప్పల్ లో ఎలివేటెడ్ కారిడార్ పనులను కూడా రేవంత్ రెడ్డి పరిశీలించారు. సోమవారంలోగా ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలి లేకుంటే సోమవారం పార్లమెంటులో నితిన్ గడ్కరీకి నివేదిస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉప్పల్ లో ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యంపై అధికారులతో మాట్లాడారు. కారిడార్ పనులు వేగవంతం చేసి సమస్యను పరిష్కరించాలని ఈఈ, ఈఎన్సీ అధికారులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శాఖల మధ్య సమన్వయలోపం కారణంగానే పనుల్లో జాప్యం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఎలివేటెడ్ పనుల సాగదీతతో స్థానికంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు.
*మమతా నగర్ నాలా పనుల పరిశీలన*
నాగోల్ మమతా నగర్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి ఆ కాలనీలో అసంపూర్తిగా ఉన్న నాలా పనులను పరిశీలించారు. నాలా పనుల్లో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తవ్వి వదిలేసిన నాలా ప్రమాదకరంగా ఉందనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీ వాసులు ప్రమాదం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా నాలా పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పొంగిపొర్లుతున్న డ్రైనేజీలతో ఇబ్బందులు పడుతున్నామని ఎల్బీ నగర్ సాగర్ రోడ్డులోని ఓంకార్ నగర్ కాలనీవాసులు రేవంత్ రెడ్డికి విన్నవించుకున్నారు.
*కొల్లాపూర్ నాయకుల చేరికలు*
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో బీఆరెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కోడేర్ మండలం బావాయిపల్లి మాజీ సర్పంచ్ వేణుగోపాల్, ఎంపీటీసీ మహేష్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు.
కామెంట్‌లు