ప్రియాంకరెడ్డి ఉదంతంపై సిఎం ఆవేదన:
ఆర్టీసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి, తీవ్ర ఆవేదన చెందారు. మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీలు వద్దని చెప్పారు. మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని కలత చెందారు. ఇది దారుణమైన అమానుషమైన దుర్ఘటనగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం :
ఆర్టీసి కార్మికులతో సీఎం కేసిఆర్ ఆత్మీయ సమావేశం... ఆద్యంతం ఉద్వేగ భరితంగా జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన సీఎం ఆత్మీయ ప్రసంగం.. అత్యంత మానవీయ కోణం లో సాగింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా స్పందించారు. సభలో ప్రతి ఒక్కరి కన్నుల్లో ఆనంద భాష్పాలు నింపాయి. నడుమ నడుమ సీఎం విసిరిన ఛలోక్తులు సందర్భోచిత సామెతలు సమావేశంలో ఉన్న ప్రతివొక్కరిని కడుపుబ్బ నవ్వించాయి. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం సిఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నరు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ కరతాళ ధ్వనులు హర్షాతిరేకాలతో సమావేశమందిరం దద్దరిల్లింది. సిఎం తమకోసం, తమ పిల్లలకోసం, తమ కుటుంబాల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు ఉద్యోగుల హృదయాల్లో ఆనందం చప్పట్ల రూపంలో హాలులో ప్రతిధ్వనించింది.
కడుపుబ్బ నవ్వించిన పిట్టకథ :
ప్రతి పని చేసేటప్పుడు చెడగొట్టేవాళ్ళు ఉంటారని చెబుతూ ముఖ్యమంత్రి రామాయణ యుద్ధం గురించి ప్రస్తావించి ఆర్టీసీ ఉద్యోగులను కడుపుబ్బ నవ్వించారు . యుద్ధంలో రామబాణం వల్ల అర్ధాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటని రాముణ్ణి అడిగినప్పుడు కలియుగంలో మీరు అక్కడక్కడా పుట్టండి అంటారు. అలా పుట్టిన వారే మనుషులను పీక్కుతింటున్నారని, వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నరు అంటూ ముఖ్యమంత్రి పేర్కొనడంతో సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.
భోజన సమయంలో కార్మికుల కష్ట సుఖాలు తెలుసుకున్న సీఎం
ప్రగతి భవన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో భోజనం చేసే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రైవర్లు , కండక్టర్ల తో ఆత్మీయంగా మాట్లాడి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు . సీఎం చాలా ఆప్యాయంగా పలకరించడంతో మహిళా కండక్టర్లు తమ సమస్యలను వివరించారు. సీఎం కు ఎంతో చొరవగా తమ కష్ట సుఖాలను చెప్పుకున్నారు .
ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ ఉద్యోగంలోంచి తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని, ప్రతీ ఏడాది వెయ్యి కోట్ల రూపాయల లాభం ఆర్టీసీకి రావాలని, ప్రతీ ఉద్యోగీ ఏడాదికి లక్ష రూపాయల బోనస్ అందుకునే స్థితి రావాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ నెల జీతాన్ని సోమవారమే అందించనున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి, సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 97 డిపోల నుంచి డిపోకు ఐదుగురు చొప్పున కార్మికులు పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ, ఇ.డి.లు, ఆర్ఎంలు, డివిఎంలు, డిఎంలు, కంట్రోలర్లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి మద్యాహ్న భోజనం చేసిన కేసీఆర్, తర్వాత రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు. అత్యంత సహృద్భావ వాతావరణంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ప్రతీ అంశంపైనా, ప్రతీ సమస్యపైనా సిఎం స్పందించారు. అప్పటికప్పుడు పరిష్కరించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కామెంట్‌లు